దెయ్యం - భయం

by Siva Kumar Anasuri


Posted on 4/26/2020 7:17:46 PMగురువు - లఘువు శీర్షిక.

  ఒక ఊరిలో ఈశ్వర శాస్త్రి మరియు గోవిందయ్య అనే గురు శిష్యులు ఉండేవారు. 


  గోవిందయ్య, ఈశ్వర శాస్త్రి  గారి వద్ద ప్రతి నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు.ఒకనాడు ఆయన తన ఊరికి దగ్గర లోని ఒక గ్రామానికి సొంత పని మీద వెళ్ళవలసి వచ్చింది. తిరుగు సమయం లో బాగా ఆలస్యం అవడం వలన చీకటి పడింది. ఆ చీకటి లోనే ఎదో ఆలోచించుకుంటూ  నడుచుకుంటూ వస్తున్నాడు. చుట్టూ చీకటి వలన ఉన్నట్టుండి ఒక్కసారిగా భయం వేయడం మొదలయ్యింది. అప్పుడు వెంటనే భగవంతుడిని తలుచుకుని వేగంగా నడవడం మొదలు పెట్టాడు. అదే సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అసలు దెయ్యాలు ఉన్నాయా అని. దేవుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా దెయ్యం కూడా ఉండే ఉంటుంది అని అనుకున్నాడు. అలా దెయ్యాలు కూడా ఉంటాయి అని ఆలోచన రావడంతో ఇంకా భయం వేయసాగింది. మొత్తానికి ఎలాగో లాగ ఇంటికి చేరుకున్నాడు. 

  ఆ రాత్రంతా దెయ్యాల గురించి ఆలోచించి ఉదయాన్నే తన గురువు ఈశ్వర శాస్త్రి వద్దకు వెళ్ళాడు. రాత్రి అతను భయపడిన విషయాన్ని చెప్పి, ఆయన్ని అసలు దెయ్యాలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు ఈశ్వర శాస్త్రి ఇలా చెప్పారు. "భగవంతుడు ఈ సృష్టి లో చాలా జీవరాశులను సృష్టించాడు. సృష్టించడంతో పాటుగా వాటికి కొన్ని మనోవికారాలను కూడా పెట్టాడు. ఆ మనో వికారాల నుండి పుట్టినదే ఈ దెయ్యము.ప్రతీ జీవి కి కొన్ని రకరకాల భయాందోళనలు మానసిక వికారాలు ఉంటాయి. ఈ రకరకాల భయాందోళనలు మానసిక వికారాలు రకరకాలుగా కలసి, రకరకాల దెయ్యాలు పుట్టుకొచ్చాయి" అని అన్నారు నవ్వుతూ. ఆయన గోవిందయ్య కి ఇంకా ఇలా చెప్పసాగారు.

  ఈ రకరకాల భయాలను, మానసిక వికారాలను భగవధ్యానం తో తొలగించుకోవచ్చు. నిజనికి, దెయ్యమనేదే లేదు, భగవంతుడి ఉనికి లేకపోవడమే దెయ్యం.ఈ సృష్టి లో వెలుతురు ఉన్నపుడు చీకటి ఉండడం సహజమే, కానీ వెలుతురు లేకపోవడం వలన చీకటి వచ్చింది, అంతేగానీ నిజానికి అక్కడ చీకటి లేనే లేదు. అలానే మన హృదయం లో భగవంతుని ఉనికి లేకపోవడం వలనే భయం, దాని నుండి దెయ్యాలు పుట్టుకొచ్చాయి అంతే గాని దెయ్యం అనేది లేనే లేదు. 

   వెలుతురు చీకటిని ఎలా దూరం చేస్తుందో, భగవంతుని ఆరాధన మరియు ధ్యానం మనలో ఉన్న భయాలను మరియు చుట్టూ ఉన్న, లేని దెయ్యాలను తొలగిస్తుంది, దానినే మనం జ్ఞానం అని అంటున్నాము. నువ్వు జ్ఞానసాగరుడు అయిన శివుడిని మనసులో బాగా ధ్యానం చెయ్యి, అప్పుడు అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు ఉద్భవించి భయం తొలగిపోతుంది." అని చెప్పారు. దానితో గోవిందయ్య కు చీకటి మరియు దాని వలన వచ్చిన దెయ్యం భయం తొలగిపోయింది.
 
కృతజ్జ్ఞతలు
 ఆస్ట్రోతెలుగు టీం.